rajus-journey-img

డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు


డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు శ్రీ మంతెన రామరాజుగారు, శ్రీమతి మంతెన లక్ష్మమ్మ గార్లకు జన్మించారు. డాక్టర్ రాజు గారి స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా, పిట్లవానిపాలెం మండలం, అలాకాపురం అనే గ్రామం. అందువల్ల రాజుగారికి ప్రకృతి విధానం అయిందని చెప్పుకోవచ్చు.

వారి ఇంటర్ వరకు విద్యాభ్యాసం వారు పుట్టి పెరిగిన ఊరులోనే జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తయ్యాకా సెలవల్లో రెండు నెలల పాటు ఆయన కాకినాడలో ఉన్న శ్రీ చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమంలో ఉండడం తటస్థించింది. అక్కడ ఆసనాలు, ఆహారానియమాలు, ఉప్పు-నూనె లేని ఆహారం తినడం బాగా అలవాటు అయ్యాయి. ఆతరువాత పై చదువులకి (బి.ఫార్మసీ) బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వున్నప్పుడు కూడా ఉడకబెట్టిన కూరలు, ముడిబియ్యపు అన్నం వండుకు తినడం, ఆసనాలు వేయడం కొనసాగించడం జరిగింది. ఆరు నెలల పాటు ఇలా ఆచరించేసరికి ఆరోగ్యం అంటే ఎలా వుంటుంది అనేది పూర్తిగా అర్థమైంది. కఫం, రొంప, దగ్గు, జ్వరాలు ఇలాంటివి పూర్తిగా లేకుండా పోయి, రోగనిరోధక శక్తితో మంచి మార్పు రావడం జరిగింది. అప్పట్నుంచి ఈ ప్రకృతి విధానం మీద ఆసక్తి బాగా పెరిగింది.

మధ్యలో కొన్ని పరిస్థితులవల్ల అన్నిరకాల ఆహార పదార్థాలు తినేసరికి ఆరోగ్య సమస్యలు (రొంప, దగ్గు, జ్వరం వంటివి) రావడం, తిరిగి ప్రకృతి విధానం పాటించాకా అవన్నీ వాటంతట అవే తగ్గిపోవడం జరగడం వల్ల ఆయనకి ప్రకృతి జీవన విధానం సంపూర్ణ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టగలదనే ప్రఘాడ విశ్వాసం కలిగింది. అనారోగ్యం గా ఉన్నప్పుడు దీర్ఘ ఉపవాసాలు చేయడం వల్ల ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యం మెరుగుపడడం గమనించారు.

అలా కొన్నాళ్లు రుచులు తింటూ, కొన్నాళ్లు ఈ ప్రకృతి విధానం ఆచరిస్తూ దేహంపైన పరిశోధనలాగా ప్రతిదానినీ గమనిస్తూ రకరకాల రుచులు తింటే రోగాలు ఎందుకు వస్తున్నాయని వారిపైన వారే పరిశోధనలు చేసుకుంటూ వుండేవారు. చివరకు ఈ ప్రకృతి విధానం ఎంతో గొప్పదని ఆచరణ రూపంలో అర్థం చేసుకోగలిగారు. చదువుకునే చదువు ద్వారా మందులు ఎంత మేలు / కీడు చేసేదీ నాలుగైదు సంవత్సరాల్లో పూర్తిగా తెలుసుకున్నారు. ఇక అక్కడనుంచీ యోగా మరియు ప్రకృతి వైద్యం అధ్యయనంచేసి దానిపట్ల పూర్తి ఆసక్తి, అవగాహన పెంచుకోవడం జరిగింది.

హైదరాబాదులో సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రకృతి విధానాన్ని ఆచరిస్తూ తోటి ఉద్యోగస్తులకు ఆసనాలు, ఆహార నియమాలు నేర్పుతూ ప్రకృతి విధానం పట్ల అవగాహన కలిగించేవారు. ఒకరోజు అయిన ఆక్సిడెంట్ కారణంగా కాలువిరిగి విశ్రాంతి తీసుకుంటున్న సమయం ఆయన ఆశయం మారడానికి ఎంతో ఉపయోగ పడింది. పైచదువులకు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనకి స్వస్తి చెప్పి ప్రకృతి జీవన విధాన ప్రచారమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని అప్పటినుంచి ప్రజలకు సేవలందిస్తూ ఉన్నారు. పూర్వకాలం లోని ఋషులు, మేధావులు ప్రవేశపెట్టిన నియమాల వెనుక సైంటిఫిక్ రహస్యాలను తెలుసుకుంటూ వాటిని ఈ నూతన కాలపు ప్రజలకి తనదైన పద్ధతిలో అందిస్తూ వచ్చారు. 1994 నుండీ ఊరూరూ తిరుగుతూ, ఆయన అనుభవాలను, ప్రకృతి విధానం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను సైంటిఫిక్ గా వివరిస్తూ ఆరోగ్య ప్రచారం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఎన్నో జిల్లాలలో ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించి ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా సేవా దృక్పథం తో విశ్రాంతి రహితంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ఆరోగ్య ప్రసంగాలు అందించడానికి రాజుగారు వెంట మరొక వాహనంలో 3,000 ప్రజలు కూర్చోనడానికి కావాల్సిన పట్టాలు, మైకు సెట్టు, జనరేటర్ సెట్ మొదలగు ఏర్పాట్లు చేయడానికి సిబ్బంది ఉండేవారు. ఏ ప్రాంత ప్రచారానికి వెళ్ళినా అక్కడ రాజుగారి ప్రసంగాలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్స్ కి భారం కాకుండా అతి సామాన్యంగా, అతి తక్కువ ఖర్చుతో ప్రచారం చేసే నిమిత్తమై రాజుగారే ఈ ఏర్పాట్లన్నీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుని ప్రచార కార్యక్రమాన్ని సాగించారు.

team-2

2000-2008 మధ్య దూరదర్శన్ లోనూ, ఈటీవీ సుఖీభవలో అప్పుడప్పుడూ, కార్యక్రమాలు అందించిన రాజుగారు ‘మాటీవీ’ కి “మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే” అనే శీర్షికన 800 ఎపిసోడ్స్, అదే సమయంలో ఐ న్యూస్  ఛానెల్ కి 15 నిమిషాలు ఎపిసోడ్స్ 360 “జీవన రహస్యాలు” అందించారు. 2009 లో లవణం గారితో అప్పగించబడిన “సంస్కార్ ప్రకృతి ఆశ్రమం” ను 25 పడకల నుంచి 100 పడకల ఆశ్రమంగా మార్చి నిర్వధికంగా ఆ ఆశ్రమ బాధ్యతను కొనసాగిస్తున్నారు. 2010 నుంచి విజయవాడ ఆరోగ్యాలయ నిర్మాణంలో, నిర్వహణలో అలసట లేకుండా ఆశ్రమ అభివృద్ధికి కృషిచేస్తూ ఉన్నారు. ఈ రెండు ఆశ్రమాల పర్యవేక్షణ, నిర్వహణ తో పాటూ ప్రస్తుతం మాగోల్డ్  ఛానల్ లో ఉదయం 6:00-6:30 వరకు “365 ఆరోగ్య రహస్యాలు” అనే కార్యక్రమం తో ప్రజలకు చేరువగా ఉంటూవచ్చారు.

నూనె-ఉప్పు శరీరానికి ఎంత నష్టాన్ని కల్గిస్తాయో వివరిస్తూ, అవి లేకుండా రుచికరంగా వంటలు చేసుకోవడం ఎలా అన్నది స్వయంగా చేస్తూ వీడియో డి‌వి‌డి ల ద్వారా పుస్తకాల ద్వారా సులభంగా నేర్చుకునే విధానాన్ని ప్రజలకి చేరుస్తూ ఉన్నారు.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరి ఇంట్లో వారు స్వంతంగా ఆచరించుకునే విధంగా పుస్తకాలు రాసి వాటిని నామమాత్రపు ధరలకు విక్రయించడం ద్వారా, ఫోన్ లో రోజూ ఒక గంట సలహాలు సూచనలు అందించడం వంటి ప్రజాహిత కార్యక్రమాలద్వారా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలా సేవలోనే ఆయన దినచర్య కొనసాగుతూ ఉంది.

  • మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.