ప్రకృతి విధానం రెండు రకాలు:
1.ప్రకృతి వైద్య విధానం:

ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్య విధానం మొదలగు వైద్య విధానాలవలే ఇది ప్రకృతి వైద్య విధానం. ఈ విధానం అన్ని వైద్య విధానాల వలె ఇంటర్మీడియెట్ తర్వాత ఎంసెట్ ర్యాంక్ ల ఆధారంగా చదివే ఐదున్నర సంవత్సరాల మెడిసిన్ కోర్స్. ఇందులో నాలుగున్నర సంవత్సరాల చదువు, ఒక సంవత్సరం హౌస్ సర్జన్ తో కలిపి మొత్తం ఐదున్నరసంవత్సరాల కోర్స్.

ప్రకృతి వైద్యం అంటే పంచభూతం(గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం) లతో చికిత్స చేసే ఒక ప్రక్రియ. ఈ వైద్య విధానంలో మందులు కానీ, పసర్లు కానీ, పూతలు కానీ, లేపానాలు కానీ ఏమీ వుండవు. ఇందులో తెలిసో, తెలియాకో ఆచరిస్తున్న చెడ్డ అలవాట్లను, చెడ్డ ఆహార నియమాలను మాన్పించి వాటి స్థానంలో మంచి అలవాట్లను నేర్పించి శరీరంలో ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. తద్వారా, మనలో దాగివున్న అనారోగ్యాన్ని శరీరమే తొలగిస్తూ వుంటుంది. పంచభూతాలతో చేసే వైద్యమే ప్రకృతి వైద్య విధానం. ఈ ట్రీట్మెంట్స్ మందుల్లేకుండా  జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ వైద్య విధానంలో ట్రీట్మెంట్స్ – వాటర్ థెరపీ, ఫాస్టింగ్ థెరపీ, డైట్ థెరపీ, యోగా థెరపీ, మసాజ్ థెరపీ, మడ్ థెరపీ, సన్ లైట్ థెరపీ మొదలగు థెరపీలు  వుంటాయి.

2. ప్రకృతి జీవన విధానం.

మన దినచర్యలో ఉన్న చెడ్డ అలవాట్లను వదిలించుకుని మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి ఇచ్చే శిక్షణే ఈ జీవన విధానం. మంచి అలవాట్లే ఆరోగ్యానికి పునాదులు. చెడ్డ అలవాట్లే అనారోగ్యానికి కారణాలు. కొత్త అలవాట్లను అలవర్చుకోవాలన్నా, మంచి అలవాట్ల వెనక వున్న రహస్యాలు తెలియాలన్నా కొంత సమయం పడుతుంది. దాని కొరకే 30 రోజుల పాటు బయటకు వెళ్లకుండా స్థిరంగా ఒకేచోట వుండి ఆరోగ్య సాధన చేయవలసి ఉంటుంది. 30 రోజులపాటు కుదరని వారు కనీసం 15 రోజులయినా ఉంటే ఉపయోగం ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకూ ఎప్పుడు, ఎన్ని నీళ్ళు త్రాగాలి, సుఖ విరేచనం అవ్వాలంటే ఏమి చేయాలి, ఏ ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది, వండుకునే విధానం ఎలా మారాలి, పెందలకడనే భోజనం చేస్తే లాభమేమిటి మొదలగు విషయాలలో పూర్తి అవగాహన కలిగించి ఆరోగ్యంగా జీవించే జీవన విధానాన్ని నేర్పించేదే ప్రకృతి జీవన విధానం. జంతువుల జీవన విధానం ప్రకృతిసిద్ధంగా, శరీర ధర్మాలకు అనుకూలంగా ఒక క్రమపద్ధతిలో వుంటుంది. కానీ మనిషి జీవన విధానం మాత్రం వారి వారి నివాసవారీగా, దేశాలవారీగా, అభిరుచులకనుగుణంగా, వృత్తి-వ్యాపారాలకనుకూలంగా, పరిస్థితులకనుకూలంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వుంటుంది. ఈ ప్రపంచంలో రకరకాల వృత్తులలో రాణించే మనం ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం శోచనీయం. శరీర ధర్మానికి తగ్గట్టు ఆహార, వ్యాయామ, విశ్రాంతి నియమాలను అలవారుచుకోవడమే ప్రకృతి జీవన విధానం. ఈ నియమాలలో క్రమశిక్షణతో కూడిన మార్పులు తీసుకురాగలిగితే మనం బి.పి., షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ బ్లాక్స్, ఫాటీ లివర్, లివర్ డిజార్డర్స్, కీళ్లనొప్పులు, చర్మవ్యాధులు, అలర్జీస్, అధిక బరువు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, మలవిసర్జనకి సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, రొంప, తుమ్ములు, దగ్గులు, కేన్సర్ మొదలైన వ్యాధుల నుంచి పూర్తి విముక్తిని పొందగలం.

ఆరోగ్యం అంటే ఏ జబ్బూ లేని స్థితి మరియు ఏ జబ్బూ రానివ్వని స్థితి అని నిర్వచనం. సంపూర్ణ ఆరోగ్యంఅంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కలిగి ఉండడం. అనారోగ్యం తో బాధపడేవారు వారి జీవనవిధానం మార్చుకుంటే శరీరంలో ఆరోగ్యం పెరిగి మెల్లగా ఆరోగ్య సమస్యలు వాటంతటవే తగ్గుతూ వుంటాయి. ఏ అనారోగ్యం లేనివారు జీవనవిధానాన్ని మార్చుకుంటే ఆరోగ్యం పెరిగి, జీవితంలో అనారోగ్యం పాలుకాకుండా రక్షణ కలిగిస్తూ వుంటుంది. ప్రతీ జీవికి ఆయుర్దాయం వున్నంతవరకూ అవయవాలన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి వాటి క్రమశిక్షణే కారణం.

క్రొత్త వారందరూ ఈ ప్రకృతి విధానాన్ని ప్రారంభించాలంటే, ఇప్పుడు మేం అందించబోయేదినచర్యను శ్రద్ధగా చదివి, ముందుగా రోజుకి 4 – 5 లీటర్ల నీరు త్రాగే అలవాటు చేసుకోవడం, రోజుకి 2 – 3 సార్లు మలవిసర్జన అయ్యేటట్లు జాగ్రత్తపడడం, ఉదయం కాఫీ, టీ లు మానేసి దాని స్థానంలో కూరగాయల రసం ప్రారంభించడం, టిఫిన్ లో ఇడ్లీ దోసెల బదులుగా మొలకెత్తిన విత్తనాలు మరియు పండ్లను అల్పాహారంగా తీసుకోవడం, మధ్యాహ్నం తెల్లటి అన్నం కు బదులు ముడిబియ్యపు అన్నం కానీ, ఆడించిన పిండితో పుల్కాలు కానీ చేసుకుని వాటిలోకి ఉప్పు, నూనెల్లేకుండా కూరలు పెట్టుకుని  తినడం, సాయంకాలం సూర్యాస్తమయం లోపు పండ్లు కానీ, పుల్కా-కూర కానీ తినడం, పెందలకడనే పడుకోవడం, రోజూ గంట – గంటన్నర పాటు ఆసనాలు, ప్రాణాయామం చేయడం మొదలగు మంచి అలవాట్లను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ అలవాటు చేసుకుంటూ వుంటే రోజు రోజుకీ ఆరోగ్యం మెరుగుపడడం జరుగుతుంది.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.